Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

భక్తి వలన ముక్తి

జగన్మాతపట్ల కేవల భక్తి పరమమైన అద్యయముక్తి నిస్తుంది. ఆదిశంకరులు సౌందర్యలహరిలో అంబికాస్తవంఇలా చేస్తున్నారు.

''భవాని త్వం దాసే మయి వితరదృష్టింసకరుణా

మతి స్తోతుం వాంఛన్‌ కథయతి భవాని త్వ మితియః,

తదైవ త్వం తసై#్మ దిశసి నిజసాయుజ్యపదవీం

ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్‌||''

శివా, భవాని, రుద్రాణి, స్వరమంగళ అనేవి అంబికకు పేళ్లు 'నీకటాక్ష మీ దాసునిపై ఇంచుక ప్రసరింపచేయు' మని తల్లిని వేడుకో నెంచినవాడై భక్తుడు 'భవాని త్వం' అంటూ ఆరంభించాడు ముందు 'భవాని' అంటూ తల్లిని పిలిచాడు. వెంటనే 'త్వం' అన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే 'భవాని త్వం' అనే మాటలకు నేను నీవుగా అగుదునుగాక అనే అర్థం కూడా చెప్పవచ్చు భూ ధాతువుకు ఉత్తమ పురుషయందు 'భవాని, భవావ భవామ' అనే రూపములు కలుగుతవి కాబట్టి భక్తుడు 'తల్లీ! నువ్వు' - (భవాని త్వం) అని ప్రార్థన ఆరంభించేసరికి ఆ మాటలకు 'నేను నీవుగా అగుదునుగాక' అనే అర్థాన్ని ఆ తల్లిగ్రహించి, వెంటనే ప్రార్థన ముగియ కుండానే నిజసాయుజ్యపదాన్ని భక్తున కనుగ్రహిస్తుందని శంకరులీశ్లోకమందు చెప్పారు. నిజానికి భక్తుడు సాయుజ్యాన్ని అడుగలేదు. తల్లి అనుగ్రహాన్ని మాత్రమే అర్థించాడు. కనుక యథార్థమైన భ##క్తేవుంటే మనం కోరని అర్థాలనుకూడా ఆ తల్లి అనుగ్రహిస్తుందని ఇచట గ్రహించవలసివుంటుంది. శంకరులు మహాభక్తులూ, మహాజ్ఞానీ, మహాకవీ కనుక ఆ మాటలలో అంబికాసంబుద్ధినేకాక నిజమనోరథాన్నిగూడా ధ్వనింపజేయగలిగారు.

సాయుజ్యమనేది పరమశాంతిని తెలియజేస్తుంది. సముద్రాన్ని పొందిన నదులకు లభించే శాంతివంటి దది. కొండ కొమ్మున బయలు దేరిన నదులు ఆడుతూపాడుతూ, జలజలా క్రిందికి దిగివస్తవి. పిమ్మట సమతలములందు మహావేగంతో మంద్రగంభీర ఘోషంతో నిండుగా ప్రవహిస్తవి. సముద్రాన్ని చేరి దానితో చేతులు కలపగానే ఆ సందడీ, ఉరవడీ తగ్గి సాయుజ్యాన్ని పొంది పరమశాంతినిభజిస్తవి. అట్లే దాస్యాది ద్వైతభావములతో బయలుదేరిన భక్తుడు అంబికానుగ్రహం వల్ల ఆ తల్లి సాయుజ్యాన్ని పొంది శారతిచెందుతాడు. ఇచట ఇతరమతస్థులు - ఈశ్వరసాయుజ్యంవల్ల లక్ష్మీపతిత్వం కూడా కలుగవలసివస్తుందికదా అని ఆక్షేపించుట కవకాశం లేదు. ఎందువల్లనంటే ముందుగా తల్లితో సాయుజ్యం. ఆ వెనుక తల్లితో గూడ శివసాయుజ్యం ఇచట చెప్పబడింది.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page